: సిద్ధివినాయకుడిదే తొలి అడుగు... మోదీ ‘గోల్డ్ స్కీం’కు తరలనున్న 40 కేజీల బంగారం
ఇళ్లలోని బీరువాల్లో దాగి ఉన్న బంగారాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘గోల్డ్ స్కీం’కు ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న బంగారం ఈ పథకానికి తరలిపోతోందని మొన్న వార్తలు వినిపించాయి. అయితే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇప్పటిదాకా ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. అయితే దేశంలోని సంపన్న ఆలయాల్లో ఒకటైన మహారాష్ట్ర సిద్ధివినాయక ఆలయం మాత్రం స్పందించింది. ప్రధాని గోల్డ్ పథకానికి సిద్ధివినాయకుడికి అందిన బంగారాన్ని తరలించాలని ఆయన కమిటీ నిర్ణయం తీసేసుకుంది. ఆలయంలోని 40 కిలోల బంగారాన్ని ఈ పథకానికి తరలించేందుకు కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ బంగారాన్ని గోల్డ్ పథకంలో డిపాజిట్ చేయడం ద్వారా సిద్ధివినాయకుడికి ఏటా రూ.69 లక్షల వడ్డీ అందనుంది. సిద్ధివినాయక స్వామి వారి ఆలయం తీసుకున్న ఈ నిర్ణయం తిరుమల, షిరిడీ తదితర ఆలయాల పాలక మండళ్లలో కదలిక తేనుందన్న ప్రచారం సాగుతోంది.