: ఎట్టకేలకు మోదీకి 'థ్యాంక్స్' చెప్పిన నితీశ్ కుమార్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాదాపు నెల రోజుల అనంతరం నితీశ్ కుమార్, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించినందుకు ఆయనకు 'థ్యాంక్స్' చెప్పారు. బీహార్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడిన నితీశ్ "బీహారుకు రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ, అదనంగా రూ. 40 వేల కోట్లను ప్రస్తుత ప్రాజెక్టులకు ఇస్తామని మోదీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిధులను పారదర్శకంగా, అవినీతి రహితంగా ఖర్చు చేస్తాం. ప్రధాని ప్రకటించిన నిధుల వ్యయంపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తాం" అని అన్నారు. నితీశ్ నోటి వెంట మోదీ ప్రకటించిన ప్యాకేజీ మాటలు, ఆయనకు కృతజ్ఞతలు రావడం ఇదే తొలిసారి. కాగా, మోదీ ఈ ప్యాకేజీ గురించి వివరించినప్పుడు, దాన్ని ఎన్నికల గిమ్మిక్ గా నితీశ్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక కృతజ్ఞతలు చెప్పడం ద్వారా, ఎంత త్వరగా నిధులిస్తారని మోదీని ప్రశ్నించినట్టు అయిందని రాజకీయ పండితులు వ్యాఖ్యానించారు.