: ఇంజినీర్ అవతారమెత్తిన చంద్రబాబు... కడ్డీలతో కట్టిన మెట్లను ఎక్కిన వైనం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా ఇంజినీర్ అవతారం ఎత్తారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించిన ఆయన పోలవరం ప్రాజెక్టు వద్ద ఇనుప కమ్మీలతో కట్టిన మెట్లను ఎక్కారు. భద్రతా సిబ్బంది సహాయంతో ఓ చేత్తో ఇనుప కడ్డీలను పట్టుకుని జాగ్రత్తగా కడ్డీలపై కాలు పెడుతూ ఆయన అక్కడి మెట్లను ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంజినీరింగ్ నిపుణులు, మేస్త్రీలు, కూలీలు మినహా... మిగిలిన వారు ఈ తరహా కడ్డీలతో కట్టిన మెట్లను ఎక్కడం దాదాపుగా దుర్లభం. అయితే చంద్రబాబు మాత్రం వాటిని ఎక్కి పనులను పరిశీలించేందుకు ఉద్యుక్తులయ్యారు. దీంతో భద్రతా సిబ్బందిలోని కొందరు ఆయన కంటే ముందుగా పైకి ఎక్కుతూ మెట్ల కమ్మీలను కాస్తంత అనుకూలంగా చేసుకుంటూ పోతే, మరికొందరు ఆయన వెనకాల జాగ్రత్తగా సదరు కడ్డీలు కదలకుండా వాటిని ఒడిసిపట్టారు. ఇలా చంద్రబాబు పైకి ఎక్కి, కిందకు సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రాజెక్టు సమీక్షలో భాగంగా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగాన్ని పెంచాలని, ఇకపై ప్రతిరోజు పనులను విజయవాడ నుంచి తానే పర్యవేక్షిస్తానని ఆయన చెప్పారు.