: 15 రోజుల నరకం, శరీరంలో రెండు బులెట్లు, రాత్రంతా బావిలో... ఢిల్లీలో మరో దారుణం!
గుండెల్లో, పొత్తి కడుపులో దిగిన రెండు బులెట్లు, 30 అడుగుల లోతు బావిలోకి తోసేసి చనిపోయిందని భావించి వెళ్లిపోయిన కామాంధులు. తీవ్ర రక్తస్రావం... శరీరం విలవిల్లాడుతున్నా బతకాలన్న కోరిక ఆ 15 ఏళ్ల బాలిక ప్రాణాలను నిలిపివుంచింది. తెల్లవార్లూ బావిలోనే ఉన్న ఆ బాలిక అరుపులు విని స్థానికులు వచ్చి రక్షించారు. దేశానికే కాకుండా అత్యాచారాలకు కూడా రాజధానిగా మారిన ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె, తన ఉదంతాన్ని పోలీసులకు వివరించింది. పోలీసులు వెల్లడించిన ఆ వివరాల ప్రకారం, పశ్చిమ ఢిల్లీలో నివాసం ఉండే పూనమ్ (పేరు మార్చాం) నవంబర్ 22న తన మొబైల్ ఫోన్ కోసం సిమ్ కార్డును కొనుగోలు చేసేందుకు సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వచ్చింది. ఆమెకు అప్పటికే పరిచయం ఉన్న క్రిషన్ అనే వ్యక్తి ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఆపై అతనికి మరో ఇద్దరు మైనర్ బాలురు కలిశారు. ముగ్గురూ కలసి "కేకలు పెడితే చంపేస్తాం" అని బెదిరించి గ్రేటర్ నోయిడా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఫాంహౌస్ కు తీసుకెళ్లారు. అక్కడ రెండు వారాల పాటు ఆమెను బంధించి నిత్యమూ అత్యాచారం జరిపారు. వారు బయటకు వెళ్లిన సమయంలో పూనమ్ కేకలు పెట్టినా, వినేందుకు ఎవరూ దరిదాపుల్లో కూడా లేరు. గత శనివారం రాత్రి బాధితురాలిని ఇంటికి పంపుతామని చెబుతూ, వారు బయటకు తీసుకువచ్చారు. ఓ ప్రాంతంలో కారును ఆపగా, ఆమె పారిపోయేందుకు యత్నించింది. ఆమెను వెంబడించి పట్టుకున్న దుర్మార్గులు కొట్టి, తమ వద్ద ఉన్న తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆపై బావిలోకి తోసి పారిపోయారు. బాధితురాలు అందించిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు క్రిషన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, పాయింట్ 12 బోర్ పిస్టల్ తో నిందితుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వివరించారు.