: ఐఎస్ఐఎస్ రాజ్యం ఎలా ఉండాలంటే... లీకైన ఉగ్రసంస్థ దస్రాలు!
ఇరాక్, సిరియాల్లో తాము స్థాపించాలనుకున్న ఇస్లామిక్ రాజ్యం ఎలా ఉండాలన్న విషయమై ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ పెద్ద ప్రణాళికే రచించింది. గత సంవత్సరం జూలై, అక్టోబర్ మధ్య వీరు రాసుకున్న 'ప్రిన్సిపుల్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ స్టేట్' ప్రతి బ్రిటన్ దినపత్రిక 'గార్డియన్' చేతికి చిక్కగా, దాన్ని ప్రచురించింది. ఈజిప్టుకు చెందిన అబూ అబ్దుల్లా అల్ మస్రి అనే వ్యక్తి దీన్ని రచించగా, విద్య, సహజ వనరుల పరిరక్షణ, పరిశ్రమలు, ద్వైపాక్షిక విధానం, సైన్యం, ఇస్లామిక్ రాజ్య ప్రచారం వంటి ఎన్నో అంశాలను ఇందులో చర్చించారు. భారీ నిధులతో పూర్తి ఆర్థిక పరిపుష్టితో రాజ్యం ఉండాలని, యుద్ధవీరులు తప్పనిసరిగా శిక్షణ తీసుకుని, ఆయుధాలను వాడటంలో ఆరితేరులు కావాలని ఇందులో ఉంది. విదేశాల నుంచి వచ్చి చేరినా, స్వదేశీ ఫైటర్లయినా, అందరికీ ఒకే ర్యాంకు, గుర్తింపు ఉంటుందని, స్వతంత్రంగా ఆయుధాలు తయారు చేసుకునే ఫ్యాక్టరీలు, ఆహార తయారీ కేంద్రాలను నిర్మించుకోవాలని ఈ దస్త్రాలు సూచిస్తున్నాయి. చిన్నారులకు తొలుత ప్రిపరేటరీ క్యాంపు, ఆపై మిలటరీ, జీహాదీ శిక్షణ, మతం, జీవితంపై పాఠాలు చెప్పించాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నారు. ఇక్కడే వీరికి షరియా చట్టాలపై సంపూర్ణ అవగాహన, నియమ నిబంధనలు, శిక్షలపై సమాచారం, తేలికపాటి ఆయుధాల వాడకంపై తర్ఫీదు ఇవ్వాలని ఉంది. ఐఎస్ఐఎస్ విస్తరించాలంటే, ఇస్లామిక్ జీవితంపై నమ్మకమున్న వారితోనే సాధ్యమని, ప్రతి సవాలును, కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించింది.