: మోదీజీ... ‘రామ మందిర్’ హామీని నెరవేర్చండి: వీహెచ్ పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా
రామ మందిరాన్ని నిర్మించి హిందువుల చిరకాల కోరికను తీర్చాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు నిన్న భోపాల్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చిన ప్రాంతంలోనే రామ మందిరాన్ని నిర్మించాలని కూడా తొగాడియా డిమాండ్ చేశారు. గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానం, ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రామ మందిరాన్ని నిర్మించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో సోమనాథ్ ఆలయ నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించిన తీరునే ప్రస్తుతం మోదీ అనుసరించాలని కూడా ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో మందిరం నిర్మాణానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తొగాడియా సూచించారు.