: ఐఎస్ఐఎస్ / దయేష్ / ఐఎస్ఐఎల్ / ఇస్లామిక్ స్టేట్... ఈ పేర్లేంటి? వీటి వెనకున్న కథేంటి?


గత వారంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఇకపై ఉగ్రవాద సంస్థల పేర్లను చెప్పాల్సి వచ్చినప్పుడు 'దయేష్' అని ఉచ్చరించాలని తన మంత్రులకు, అధికారులకు సూచించారు. దయేష్ అంటే 'దల్వత్ అల్-ఇస్లామియా అల్ ఇరాక్ వ ఆల్-షమ్'. ఇకపై ఈ పదాన్నే వాడాలని, 'ఇస్లామిక్ స్టేట్' అన్న పదం వాడవద్దని బీబీసీని సైతం ఆయన గతంలోనే ఆదేశించారు. సిరియాపై విమాన దాడులు జరపాలా? వద్దా? అన్న విషయమై బ్రిటన్ పార్లమెంటులో చర్చిస్తున్న వేళ, ఉగ్రసంస్థలను ఇకపై ఎలా పలకాలన్న విషయంలోనూ చర్చ జరిగింది. ఇటీవలి కాలం వరకూ బ్రిటన్ ఉగ్రవాదులను ఈఐఐఎల్ (ఎలీతత్ ఇస్లామిక్ ఎన్ ఇరాక్ ఎత్ ఎన్ సిరియా) అని వ్యవహరిస్తూ రాగా, ఇప్పుడిక దాన్ని దయేష్ గా మార్చి పలకాలని నిర్ణయించింది. వీటితో పాటు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ సిరియా), ఐఎస్ఐఎల్ (ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ లెవాంత్), ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఇలా ఎన్నో పేర్లతో ఉగ్రసంస్థ తన ఉనికిని చాటుకుంటోంది. ఓ కాలిఫేట్ (స్వతంత్ర రాజ్యం) ను ప్రకటించుకున్న ముష్కరులు ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించే ఏకైక లక్ష్యంతో సాగుతున్న వేళ, వారికి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుంటే... 1999లో అబూ ముసాబ్ అల్ జర్కావీ అనే జోర్డాన్ మిలిటెంట్ ఇరాక్ లో బాంబు దాడులు, తలలు నరకటం వంటి దారుణ చర్యలు జరుపుతూ, జమాత్ అల్-తావ్హిద్ వల్-జీహాద్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ప్రారంభించాడు. అదే సంస్థ అక్టోబర్ 2004లో ఒసామా బిన్ లాడెన్ తో కలిసిన తరువాత అల్ ఖైదా ఇన్ ఇరాక్ (ఏక్యూఐ)గా మారింది. అప్పటి నుంచి ఈ గ్రూప్ నెమ్మదిగా విస్తరిస్తూ, ఎన్నో దారుణాలకు ఒడిగట్టింది. ఆ సంస్థకు నేతగా ఉన్న అబూ బకర్ అల్-బాగ్దాదీ, 2006లో ఉగ్ర సంస్థ పేరును ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ (ఐఎస్ఐ) అని పెట్టుకుని ఆపై 2013లో దానికి 'అండ్ అల్-షామ్' అన్న పదాలు తగిలించి 'ఐఎస్ఐఎస్' అని నామకరణం చేసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్): జూన్ 2014లో, ఉగ్రవాదులు, తాము చివరి రెండు పదాలనూ తొలగిస్తున్నామని, తమది స్వతంత్ర రాజ్యమే కాబట్టి 'ఇస్లామిక్ స్టేట్' అని పలకాలని నిర్ణయించుకున్నారు. ది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్): దీనికి అసలు పేరు అరబిక్ పదాల కలయికలో వచ్చింది. అది 'అల్ దవ్లా అల్ ఇస్లామియా ఫి అల్-ఇరాక్ వా అల్-షామ్'. ఇందులో మొదటి మూడు పదాలు ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అని వస్తుంది. ఇక అల్-షామ్ అంటే సిరియా, దాని చుట్టు పక్కల ప్రాంతాలు. తమ ఏకైక లక్ష్యం కాలిఫేట్ ఏర్పాటేనని ప్రకటించుకున్న ఉగ్రవాదులు అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతో ఐఎస్ఐఎస్ కు ప్రాచుర్యం తెచ్చారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఇదే పేరుతో నడుస్తున్నాయి. ఈజిప్టులోని ఓ దేవతకూ ఇదే పేరుంది. దీంతో ఈ పదాన్ని ఉచ్చరించేందుకు పలు దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ ది లెవాంత్ (ఐఎస్ఐఎల్): సిరియా, దాని చుట్టు పక్కల ప్రాంతాలను చరిత్రలో 'లెవాంత్'గా అభివర్ణించారు. ఈ పదానికి ఫ్రెంచ్ భాషలో 'ఉదయిస్తున్న సూర్యుడి భూమి' అని అర్థం. సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, జోర్డాన్ ప్రాంతాలన్నీ లెవాంత్ పరిధిలోకే వస్తాయి. గత బుధవారం వరకూ బ్రిటన్ ప్రభుత్వం సైతం ఉగ్రవాదులను ఐఎస్ఐఎల్ పేరుతోనే పలుకుతూ వచ్చింది. లెవాంత్ పరిధిలోని పలు దేశాల్లో ఉగ్రవాదుల ప్రాబల్యం అంతగా లేనందున పేరు మార్చాల్సి వచ్చింది. అమెరికా ప్రభుత్వం ఈ పేరునే ఎక్కువగా ఉపయోగిస్తుంది. దల్వత్ అల్-ఇస్లామియా అల్ ఇరాక్ వ ఆల్-షమ్ (దయేష్): ఈ పదాన్ని వివిధ దేశాల్లో దయిష్, డాయిష్ అని కూడా పలుకుతున్నారు. పలు అరబిక్ మీడియా సంస్థలు ఈ పదాన్ని వాడేందుకు నిరాకరిస్తున్నాయి. అరబిక్ పదాల నుంచి వచ్చిన దయేష్ అంటే 'తొక్కివేయడం' లేదా 'నలిపేయడం' అనే అర్థం వస్తుందని చెబుతున్నాయి. దయేష్ అన్న పదం అమాయకులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం, అపసవ్య రాజకీయ ధోరణికి నిదర్శనమని దీన్ని వాడటంపై తాము అసమ్మతిని తెలియజేస్తామని పలువురు అరబిక్ దేశాల ప్రతినిధులు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఐఎస్ఐఎల్ అన్న పదానికి సరైన ఆంగ్ల పదం దొరకకనే ఉగ్రవాద సంస్థకు ఇన్ని పేర్లు వచ్చాయని నిపుణులు వ్యాఖ్యానించారు. మరికొందరు విద్యావేత్తలు అరబిక్ భాషలో దయేష్ కు అర్థమే లేదని, అని కేవలం ఐఎస్ఐఎల్ కు సంక్షిప్తపదం మాత్రమేనని అంటున్నారు. ప్రపంచాన్ని వీలైనంతగా నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులు ఏ పేరుతో ఉంటేయేం? వారిని ఏ పేరుతో పిలిస్తేనేం? వారి కుట్రలను అడ్డుకునే మార్గాలు వెతికి, సామాన్యుల ప్రాణాలు కాపాడాలి తప్ప!

  • Loading...

More Telugu News