: వరద బాధితులకు సహాయం చేద్దామని వెళితే, 'అమ్మ' ప్రచారం చేసుకుంటున్నారు!
చెన్నైలో వరదబాధితుల సహాయకచర్యలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. చెన్నై కష్టాన్ని తమ కష్టంగా భావించిన ఎంతో మంది సహృదయులు ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న చెన్నై వాసులకు వివిధ ప్రాంతాల ప్రజలు ఆహారం, నిత్యావసరాలు పంపించారు. ఈ క్రమంలో వీరు నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ తో చెన్నై చేరుకున్నారు. అక్కడ అన్నా డీఎంకే కార్యకర్తలు వీరిని ఆపి, వీరు సరఫరా చేసే ఆహారం ప్యాకెట్లు నింపిన బస్తాలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బొమ్మ ఉండాల్సిందేనని బలవంతం చేశారు. దీనిని వ్యతిరేకించిన యువకులు అక్కడ చోటుచేసుకున్న సంఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహాయం చేసేందుకు ముందుకువస్తే, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలపై అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జయలలితను అప్రదిష్ఠపాలు చేసేందుకు ఇది ప్రత్యర్థులు పన్నిన కుట్రలో భాగమని అంటున్నారు. దీనిపై పార్టీ ప్రకటన చేస్తుందని ఓ నేత చెప్పారు.