: మాస్టర్ కెరీర్లో స్వీట్ మెమరీస్


సచిన్ రమేశ్ టెండూల్కర్.. పరిచయం అక్కర్లేని ఈ నవ యువకుడు(!) నేడు నలభయ్యవ పడిలో ప్రవేశించాడు. మూడున్నర దశాబ్దాల క్రితం, టీనేజ్ ప్రాయంలో ఉన్న సచిన్.. అప్పట్లో తనకిష్టమైన టెన్నిస్ ను జీవిత లక్ష్యంగా ఎంచుకుని ఉంటే.. ఈరోజు దేవుడులేని క్రికెట్ ను మనం చూడాల్సి వచ్చేది! అనితర సాధ్యమైన రీతిలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ ను కొనసాగించడమే కాకుండా, కొన్నాళ్ళ క్రితం వరకు గణాంక నిపుణులకు నిత్యం పనికల్పించిన ఈ బ్యాటింగ్ లెజెండ్.. ప్రస్తుతం తన క్రీడా ప్రస్థానం చరమాంకంలో ఉన్నాడు.

మరెన్నో ఏళ్ళు ఈ మాంత్రికుడి నుంచి పరుగుల మాయాజాలాన్ని ఆశించలేమని అభిమానులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో సచిన్ చేసిన పేలవ ప్రదర్శనలు ఆ విషయాన్ని నిజమే అని చెబుతాయి. ప్రతికూల పరిస్థితులు వదలక వెన్నాడుతుంటే, ఎంతటి క్రీడాకారుడికైనా విశ్రాంతి, విరమణ తప్పనిసరి. సచిన్ కూడా అందుకు అతీతుడు కాడు. కానీ, ముందుముందు తన ఆరాధకుల్లాగే సచిన్ కూడా గతకాలపు స్మృతులను తలచుకుని అప్పుడప్పుడు ఆనందభరితుడవ్వచ్చు. ఆ మధుర ఘట్టాలను గుర్తు చేసుకుని మురిసిపోవచ్చు. అయితే, ఒకటా రెండా.. మాస్టర్ కెరీర్లో ఎన్నో తీపి గుర్తులు! కానీ, మాస్టర్ మెచ్చినవి మాత్రం ఐదే. ఎన్నో సందర్భాల్లో సచినే స్వయంగా పేర్కొన్న ఆ మరువలేని ఘట్టాలివిగో..

ప్రపంచకప్ విజయం

సచిన్ కెరీర్లో రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్ లు ఆడాడు. కానీ, ఆరో ప్రయత్నంలో మాత్రమే ఈ మాస్టర్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్ట్ ను ప్రపంచకప్ ట్రోఫీ వరించింది. 2003లో భారత్ ఫైనల్ మెట్టు వరకు వచ్చి అక్కడ చతికిలబడడం సచిన్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, 2011 వరల్డ్ కప్ టైటిల్ పోరులో టీమిండియా లంకపై చిరస్మరణీయ విజయం సాధించడం ద్వారా తన గాడ్ కు సరైన కానుక ఇచ్చింది. ఆ సందర్భంగా యువ కెరటం విరాట్ కోహ్లీ సచిన్ ను భుజాలపై మోసుకుని స్టేడియం అంతా కలియదిరిగాడు. అదేమని అడిగితే, దశాబ్దాలుగా సచిన్ జట్టు భారాన్ని మోశాడని, అందుకే ఆయన్ను తన భుజాలపైకెక్కించుకున్నానని తెలిపాడు.

సొంత గడ్డ లాంటి మైదానమిది

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.. సచిన్ కు సొంత గడ్డ కాదు కానీ, అంతకంటే ఎక్కువగా సచిన్ కు సహకరించిన మైదానం ఇది. ఆస్ట్రేలియాలో 2003-04 సిరీస్ లో సచిన్ పని అయిపోయిందనే భావించారు అంతా. తొలి మూడు టెస్టుల్లో మాస్టర్ దారుణంగా విఫలమయ్యాడు. కానీ, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ మాత్రం సచిన్ ను గట్టెక్కించింది. ఇక్కడ జరిగిన నాలుగో టెస్టులో సచిన్ 241 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో, ఆ మ్యాచ్ ను డ్రా చేసుకున్న భారత్ సిరీస్ నూ సమం చేసి పరువు నిలుపుకుంది.

హీరో కప్ లో మాయాజాలం

1993లో భారత్ వేదికగా జరిగిన హీరో కప్ లో సెమీ ఫైనల్లో భారత్ ను విపత్కర స్థితి నుంచి గట్టెక్కించిన ఘనత సచిన్ దే. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్ లో చివరి ఓవర్ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆ పోరులో భారత్ తొలుత 195 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో సఫారీలు నెగ్గాలంటే చివరి ఓవర్లో 6 పరుగులు చెయ్యాలి. జట్టులో కపిల్ వంటి లెజెండరీ బౌలర్లున్నా కెప్టెన్ అజారుద్దీన్ బంతిని తీసుకెళ్ళి సచిన్ కు ఇచ్చాడు. సచిన్.. తన కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో కేవలం రెండే పరుగులిచ్చి భారత్ ను ఫైనల్ చేర్చాడు.

అక్తర్ కు చుక్కలు కనిపించిన వేళ

అది 2003 ప్రపంచకప్. వేదిక సెంచూరియన్, దక్షిణాఫ్రికా. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్. దాయాదితో మ్యాచ్ అంటే రెచ్చిపోయే సచిన్ అక్కడా అదే చేశాడు. ఈ మ్యాచ్ లో పాక్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ను చితక్కొట్టాడు. ఇక స్వింగ్ ఆర్టిస్టులు వసీం అక్రమ్, వకార్ యూనిస్ అయితే బిక్కచచ్చిపోయారు. ముఖ్యంగా అక్తర్ బౌలింగ్ లో థర్డ్ మ్యాన్ దిశగా సచిన్ కొట్టిన స్లైస్ షాట్ ఇప్పటికీ హైలైటే!

  • Loading...

More Telugu News