: చెన్నై వాసులకు ఆపన్నహస్తం చాచిన బెంగళూరు ‘అమృతధార’!
ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిన చెన్నై మహానగరంలోని వరద బాధితులకు ‘అమృతధార’ ఆపన్న హస్తం అందించింది. మురికినీటిని మంచినీటిగా మార్చే యంత్రం సహాయంతో చెన్నై వాసులకు గుక్కెడు మంచినీళ్లు అందించడానికి ఔత్సాహిక వ్యాపారవేత్త దినేష్ జైన్ ముందుకువచ్చారు. ఎటువంటి మురికి నీటినైనా సరే మంచినీటిగా మార్చే ఫ్యూరిఫికేషన్ ప్లాంట్ తో ఉన్న ట్రక్కుతో బెంగళూరుకు చెందిన ఈ వ్యాపారవేత్త చెన్నై కు వచ్చారు. ఈ ఫ్యూరిఫికేషన్ ప్లాంట్ పేరు ‘అమృతధార’. బెంగళూరు నుంచి చెన్నైకి శుక్రవారం నాడే దినేశ్ చేరుకున్నారు. కానీ, వరద నీటిని మంచినీరుగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. స్థానిక నాయకులు, ప్రజల ఒత్తిడి మేరకు శనివారం నాడు కొన్ని లీటర్ల మంచినీటిని తయారు చేశారు. ఆ నీటిని పరీక్షల కోసం ప్రభుత్వ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ నివేదిక రాగానే మంచినీటిని ప్రజలకు ఉచితంగా సరఫరా చేస్తానని మీడియాతో ఆయన చెప్పారు. మానవతా దృక్పథంతోనే ఇక్కడికి వచ్చాననీ, వ్యాపారం కోసం కాదని దినేష్ జైన్ అన్నారు.