: మూడేళ్లలో సచిన్ తొలి ప్రశ్న!... రైల్వేలపై పార్లమెంటులో ప్రశ్న అడిగిన మాస్టర్
క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్ చట్టసభ సభ్యుడిగా మారారు. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే ప్రముఖుల కోటాలో సచిన్ కు ఈ గౌరవం దక్కింది. అయితే క్రికెటర్ గా ఆకట్టుకున్న ఆయన ఎంపీగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు. సభా సమావేశాలకు డుమ్మా కొట్టడంలో రికార్డులు నమోదు చేసిన వారి జాబితాలో సచిన్ చేరిపోయారు. ఈ క్రమంలో ఆరేళ్ల పదవీ కాలంలో ఇప్పటికే మూడేళ్ల పదవీ కాలం ముగిసేపోయింది. ఈ మూడేళ్ల కాలంలో సచిన్ పార్లమెంటులో నోరు తెరచిన పాపాన పోలేదు. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించి నిన్న సచిన్ పార్లమెంటులో తన తొలి ప్రశ్నను ప్రభుత్వానికి సంధించారు. అయితే ఈ సందర్భంగానూ ఆయన స్వరం పార్లమెంటులో వినిపించలేదు. ఎందుకంటే తాను అడగాలనుకున్న ప్రశ్నను ఆయన పేపర్ పై రాసిచ్చేశారు. దానికి ప్రభుత్వం కూడా రాతపూర్వక సమాధానాన్నే ఇచ్చింది. అయినా, సచిన్ అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా?... ముంబై నగరం సహా పలు నగరాల్లోని సబర్బన్ రైలు వ్యవస్థను ప్రత్యేక జోన్ ను ప్రకటించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే... ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు సచిన్ మరో ప్రశ్నను సంధించారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఈ నెల 7న సమాధానం ఇవ్వనుంది.