: ట్రాఫిక్ లో... నకిలీ పోలీసు కారులో దూసుకెళ్లిన మడోన్నా


లండన్ వీధుల్లో ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు పాప్ సింగర్ మడోన్నా అక్కడి పోలీసులు, వాహనదారులను బోల్తా కొట్టించింది. ఇందుకామె నకిలీ పోలీసు కారు ఉపయోగించి ఎంచక్కా చెక్కేసింది. ఓ2 ఏరెనా ప్రాంతంలో నలుపు రంగు జాగ్వార్ కారులో వెళుతుండగా ఆమెకు భారీగా ట్రాఫిక్ కనిపించింది. ముందుకువెళ్లడానికి ఏమాత్రం వీలులేదు. అయితే ఆమె కారుపై ఎరుపు, నీలిరంగు లైటు వెలగడంతో అది పోలీసు కారని భావించిన మిగతా వాహనదారులు పక్కకు తప్పుకున్నారు. పోలీసులు కూడా దారి వదిలి పంపించారు. ఈ మేరకు గత రెండు రోజుల్లో లండన్ లోని ఓ2 ఏరెనా ప్రాంతంలో ఆమె ప్రయాణించిందని ఫిమేల్ ఫస్ట్.యూకే డాట్ కామ్ తెలిపింది. అయితే ఆ కారులో ఉన్నది మడోన్నా అని పోలీసులకుగానీ, వాహనదారులకు గానీ అస్సలు తెలియదట. ఆ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, ఓ2 ఏరెనా వద్ద తాను నిలబడి వుండగా వాహనాలతో రోడ్లన్నీ దిగ్బంధం అయ్యాయని చెప్పారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఓ వాహనం ఫ్లాష్ లైట్లతో, భారీ చప్పుడు చేస్తూ దూసుకొచ్చిందని, అది అండర్ కవర్ కాప్ వాహనం అయి ఉంటుందని భావించి అందరూ దారి వదిలారని తెలిపారు. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ క్లియర్ చేశారని, తీరా చూస్తే వాహనంలో ఉన్నది పాప్ సింగర్ మడోన్నా అని అతను వివరించాడు.

  • Loading...

More Telugu News