: వ్యూహం మార్చిన టీమిండియా... ఫాలో ఆన్ ఆడించేందుకు నిరాకరణ


టీమిండియా వ్యూహం మార్చింది. ఒక టెస్టునైనా గెలిచి పరువు కాపాడుకుందామని భావించిన సఫారీల ఆశలకు గండి కొడుతూ టీమిండియా సరికొత్త వ్యూహంతో ఫాలో ఆన్ ఆడించేందుకు నిరాకరించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో వీలైనంత భారీ స్కోరు సాధించి సఫారీల ముందు భారీ లక్ష్యం ఉంచుదామని భావించిన టీమిండియా ఊహించినట్టే స్పిన్ పిచ్ పై భారీ స్కోరుగా చెప్పుకోదగ్గ పరుగులు సాధించింది. విశ్లేషకులు ఊహించినట్టే సఫారీలు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఆమ్లా, డుప్లెసిస్, డుమిని తదితరులు ఘోరంగా విఫలమవడంతో ఫాలో ఆన్ గండంలో పడింది. అయితే డివిలియర్స్ సాధారణ శైలిలో దూకుడుగా ఆడి 42 పరుగులు చేయడంతో టీమిండియా తన ప్లాన్ లో మార్పులు చేసింది. ఫాలో ఆన్ ఆడించడం ద్వారా సఫారీలు మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశం లేకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని భారత జట్టు నిర్ణయించింది. టెస్టులో విజయం సాధించేందుకు అవసరమైన 213 పరుగుల ఆధిక్యం ఉన్నప్పటికీ, ఆమ్లా, డుప్లెసిస్, డుమిని, డివిలియర్స్ చెలరేగి ఆడే అవకాశం ఇవ్వడం ప్రమాదకరం అని భావించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తద్వారా నాలుగో టెస్టులో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో పాయింట్లు పెంచుకుని, ర్యాంకుల జాబితాలో సఫారీల ఆధిక్యానికి కళ్లెం వేసి, టీమిండియా స్థాయిని పెంచుకోవాలని భారత జట్టు భావిస్తోంది. దీంతో సఫారీలను ఫాలోఆన్ ఆడించేందుకు నిరాకరించింది. మూడో రోజు భారత జట్టు ఫ్రెష్ గా బ్యాటింగ్ ప్రారంభించనుంది. తొలి సెషన్ లో ధాటిగా బ్యాటింగ్ చేసి, స్కోరు బోర్డును ముందుకు ఉరికించి, సఫారీలకు బ్యాటింగ్ అప్పగించనుంది.

  • Loading...

More Telugu News