: భారత్ పై పాకిస్థాన్ అణుబాంబులు వేయాలనుకుంది: అమెరికా అధికారి
కార్గిల్ యుద్ధంలో ఘోరపరాభవాన్ని చవి చూసిన పాకిస్థాన్ భారత్ పై అణుబాంబులు వేయడానికి ప్రణాళికలు రచించుకుందని అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు హెచ్చరికలు జారీ చేసిందని వైట్ హౌస్ మాజీ ఉన్నతాధికారి బ్రూస్ రీడెల్ ప్రకటించి పాక్ కుటిల బుద్ధిని బట్టబయలు చేశారు. అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి తెరతీశాడు. ఒక్కసారిగా పాక్ సైనికులు విరుచుకుపడడంతో తేరుకున్న భారత సేనలు పాక్ దాడులను తిప్పికొడుతున్నాయి. పాక్ అధీనంలో ఉన్న ఒక్కో స్థావరాన్ని వశం చేసుకుంటూ భారత సైన్యం ముందుకు సాగుతోంది. ఈ దశలో ఓటమి పాలవడం అన్నది పాకిస్థాన్ ను అంతర్జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తుందని భావించిన అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఈ విషయంలో క్లింటన్ కల్పించుకుని, భారత్ తో సామరస్యపూర్వక సంధి చేయాలని కోరారు. 1999 జూలై 4న అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తో ఈ విషయమై ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన భేటీకి ముందు క్లింటన్ ను సీఐఏ అధికారులు పాక్ అణ్వాయుధ దాడిపై ముందుగానే హెచ్చరించినట్టు బ్రూస్ రీడెల్ తెలిపారు. క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ కేన్సర్ వ్యాధి కారణంగా బుధవారం మృతి చెందారు. ఆయన స్మృత్యర్థం రాసిన వ్యాసంలో ఆ రోజు సమావేశానికి ముందు, ఆయన క్లింటన్ కు పలు విషయాలు వివరిస్తూ, 'వాతావరణం గంభీరంగా ఉందని, భారత్ పై అణ్వాయుధాలు ప్రయోగించేందుకు పాక్ సర్వ సన్నద్ధంగా ఉందని, పాకిస్థానే యుద్ధం మొదలుపెట్టిన కారణంగా భేషరతుగా యుద్ధం ఆపేయాలని' షరీఫ్ కు సూచించాలని క్లింటన్ కు బెర్జర్ తెలిపారని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు.