: చెన్నై మునగడానికి సవాలక్ష కారణాలు!
భారీ వర్షాల కారణంగా మెట్రోనగరం చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారుల నుంచి రన్ వేల వరకు అన్నీ జలమయమైపోయాయి. ప్రజలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. నదుల పరీవాహక ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యుత్ సరఫరా పూర్తిగా బంద్ అవడంతో ఈ మెట్రో నగరంలో రెండు రోజులుగా చీకటి రాజ్యం నెలకొంది. చెన్నై మహానగరాన్ని వర్షపు నీరు ముంచెత్తడానికి గల కారణాలపై పర్యావరణ వేత్తలు ఏమంటున్నారంటే... * చెన్నై లో ప్రధానంగా మూడు నదులు ప్రవహిస్తున్నాయి. కొసస్తతలయర్, కూవుం, అడయార్ నదుల పరీవాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురవడం * బ్రిటిష్ కాలంలో నిర్మించిన బకింగ్ హామ్ కెనాల్ నిర్వహణ గురించి ప్రస్తుతం పట్టించుకోకపోవడం. * చెన్నై నగర ప్రణాళిక సరిగ్గా లేకపోవడం. వరదనీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం. * గత ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్ యూఆర్ ఎం నిధులతో కాల్వల పటిష్టతను ప్రారంభించారు. వరద నీటిని సముద్రంలోకి మళ్లించే విధంగా నిర్మించ తలపెట్టిన కాల్వల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడం. * చెన్నై శివారు ప్రాంతమైన వేలచ్చేరి ఒకప్పుడు చిత్తడి నేలలతో ఉండేది. ఈ నేలలు కనుమరుగవడంతో వర్షపు నీరు అక్కడే నిలిచిపోతోంది. * నగరంలోని సుమారు 600కు పైగా చెరువులు ఉన్నాయి. ఇవి క్రమ క్రమంగా క్షీణించిపోవడం వంటి కారణాలు చెన్నై జలదిగ్బంధంలో ప్రధాన పాత్ర పోషించాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.