: 26/11 ఉగ్రదాడి నా జీవితాన్ని మార్చేసింది: రతన్ టాటా
26/11 మారణహోమంగా పేరుగాంచిన ముంబై ఉగ్రదాడి తన జీవితాన్ని మార్చేసిందని టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా చెప్పారు. బరోడా మేనేజ్ మెంట్ అసోసియేషన్ (బీఎంఏ)కు చెందిన సాయాజీ రత్న అవార్డును అందుకున్న తర్వాత యువతతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. "నా జీవితాన్ని వెనక్కి తిప్పితే... ముంబై ఉగ్రదాడులు నా జీవితాన్ని మార్చాయని కచ్చితంగా చెప్పగలను. ఆ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన ఆరు నెలల వరకు నా గొంతు మూగబోయింది. ఇప్పుడు మాట్లాడుతున్న విధంగా అప్పుడు మాట్లాడలేకపోయా. ప్రతి సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని కలుస్తుండేవాడిని. దాడి జరిగిన మూడు రోజుల వరకు వాళ్లు బిల్లులు కూడా చెల్లించలేని స్థితిని చూశాను. ఆ తర్వాత బాధితులను ఆదుకోవడానికి, పునరావాసం కల్పించడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేశాం" అంటూ అప్పటి ఘటనను గుర్తు చేసుకున్నారు.