: ఎంపీ మిథున్ రెడ్డి ఫిర్యాదు ఎందుకు స్వీకరించలేదు?: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ఫిర్యాదును ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. తిరుపతి విమానాశ్రయంలో జరిగిన గొడవకు సంబంధించి ఎయిర్ ఇండియా మేనేజర్ చేసిన ఫిర్యాదు తీసుకున్నప్పుడు... మిథున్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు స్వీకరించలేదని నిలదీసింది. దీనికి సమాధానంగా, మిథున్ వ్యక్తిగతంగా ఫిర్యాదు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో, సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు తెలియవా...? అని ప్రశ్నిస్తూ, వ్యక్తిగతంగా రాకపోయినా ఈమెయిల్ లేదా పోస్టులో ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందన్న విషయాన్ని జడ్జి గుర్తు చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు.