: నా దృష్టిలో అమితాబ్ నడిపిన ఆ స్కూటర్ ఖరీదు కోటి రూపాయలు!: స్కూటర్ యజమాని
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'తీన్'. రిబూ దాస్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ స్కూటర్ నడిపే సన్నివేశాలను ఇటీవల కోల్ కతా లో షూట్ చేశారు. చాలా పాతగా ఉండే ఈ స్కూటర్ ను అమితాబ్ డ్రైవ్ చేస్తుండగా, ఆయన వెనుక నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూర్చుని ఉంటారు. ఈ షూటింగ్ దృశ్యాలు అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. అయితే, అందరికంటే ఎక్కువగా సంతోషించింది, ఆనందపడింది ఎవరై ఉంటారనుకుంటున్నారు?...ఆ స్కూటర్ ఓనర్. అవును! షూటింగ్ నిమిత్తం ఆ స్కూటర్ ని 'తీన్' చిత్ర యూనిట్ కి ఇచ్చిన యజమాని పేరు సుజిత్ అకా భైదా. ట్రాన్స్ పోర్ట్ సప్లయర్ గా పనిచేస్తున్న ఆయన వద్దకు మూడు నెలల క్రితం ఈ చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు. యూనిట్ సభ్యులకు అవసరమైన సరంజామా లిస్టును అతని ముందు ఉంచారు. పనిలో పనిగా అతని పాత స్కూటర్ కూడా వారికి నచ్చింది. దీనికి తోడు కలర్ కూడా వారు కోరుకున్నదే ఉండటంతో షూటింగ్ నిమిత్తం దీనిని తీసుకెళ్లడంతో తన ఆనందానికి అంతు లేదని సుజిత్ పేర్కొన్నాడు. ‘నా దృష్టిలో ఈ స్కూటర్ ఖరీదు కోటి రూపాయలు. ఎందుకంటే, ఈ స్కూటర్ ని బిగ్ బీ నడిపారు కనుక. దీనిని ఎప్పటికీ అమ్మను. అమితాబ్ పెద్ద సైజ్ ఫొటోతో పాటు, ఈ స్కూటర్ ఫొటోని ఫ్రేమ్ కట్టించి నా ఇంట్లో తగిలిస్తాను’ అని సుజిత్ ఆనందంతో చెబుతున్నాడు.