: హైదరాబాదులో తళుక్కుమన్న ములాయం... జయప్రద కుమారుడి రిసెప్షన్ కు హాజరు
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు వచ్చారు. పార్టీ మాజీ నేత, సినీ నటి జయప్రద కుమారుడి పెళ్లి విందు (రిసెప్షన్)కు హాజరయ్యేందుకే ఆయన లక్నో నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వచ్చారు. సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ తో కలిసి హైదరాబాదు వచ్చిన ములాయం నేరుగా పెళ్లి విందుకు హాజరయ్యారు. విందులో భాగంగా నూతన వధూవరులు సిద్ధార్థ్, ప్రవళికలను ఆశీర్వదించిన ములాయం, ఆ తర్వాత రాత్రి తిరిగి లక్నో బయలుదేరి వెళ్లారు. హైదరాబాదు వచ్చిన ములాయంను స్థానిక మీడియా చుట్టుముట్టింది. బీహార్ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశ్నలు సంధించింది. అయితే పెళ్లి విందుకు వచ్చిన తాను రాజకీయాలు మాట్లాడబోనని ప్రకటించిన ములాయం, రాజకీయాలు మాట్లాడేందుకు త్వరలోనే తాను మరోమారు హైదరాబాదుకు వస్తానని చెప్పారు.