: ఇక పాస్తా వంతు... నెస్లేకు మరో ఎదురు దెబ్బ
మ్యాగీ నూడుల్స్ లో ప్రమాదకర రసాయనాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో షాక్ తిన్న నెస్లే ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రమాదకర స్థాయిలో రసాయనాలున్నాయని ల్యాబోరేటరీ పరీక్షలు కూడా తేల్చడంతో దేశవ్యాప్తంగా మ్యాగీ విక్రయాలు నిలిచిపోయాయి. అప్పటిదాకా లాభాల్లో ఉన్న నెస్లే, ఈ చర్యతో నష్టాల బాట పట్టక తప్పలేదు. మలి దఫా పరీక్షల్లో పాసైన మ్యాగీ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఈ విపరిణామాల నుంచి స్లోగా కోలుకుంటున్న నెస్లేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పాస్తాలో సీసం పరిమాణం నిర్ణీత ప్రమాణం కంటే అధిక స్థాయిలో ఉందని ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబోరేటరీ పరీక్షల్లో తేలింది. సాధారణంగా పాస్తాలో 2.5 పీపీఎం దాకా సీసం ఉండొచ్చు. అయితే నెస్లే పాస్తాలో సీసం పరిమాణం 6 పీపీఎంగా ఉందట. యూపీ లాబోరేటరీ నివేదక ప్రకారం నెస్లే పాస్తా ప్రమాదకర ఆహార పదార్థాల జాబితాలో చేరిపోయింది. మరోమారు దీనిపై పరీక్షలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ విషయంపై నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.