: మళ్లీ యాక్షన్ లోకి చంద్రబాబు... నారావారిపల్లె వాసులతో భేటీ, రహదారులపై హామీ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పనిలో రాక్షసుడే. పరిపాలనలో ఆయనకు రాత్రింబవళ్లనే తేడా ఉండదు. చంద్రబాబు వద్ద పనిచేసే అధికార యంత్రాంగానికి ఈ విషయం బాగానే తెలిసి ఉంటుంది. అయితే చంద్రబాబు మనవడి పుట్టు వెంట్రుకల పుణ్యమాని ఏపీ సీఎంఓలో పనిచేస్తున్న అధికారులు, ఇతర సిబ్బందికి కాస్తంత విశ్రాంతి దొరికి ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే, నిన్న సాయంత్రం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఉన్న తన సొంతూరు నారావారిపల్లెకు చంద్రబాబు వచ్చారు. నిన్న సాయంత్రం నుంచి దాదాపుగా నేటి మధ్యాహ్నం వరకూ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లోనే మునిగిపోయారు. ఈ క్రమంలో విధుల నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటే, ఆయన వద్ద పనిచేసే సిబ్బందికీ విశ్రాంతి లభించినట్టే కదా. నేటి మధ్యాహ్నం మనవడు దేవాన్ష్ పుట్టు వెంట్రుకల సమర్పణ కార్యక్రమం ముగిసిన మరుక్షణం మళ్లీ చంద్రబాబు యాక్షన్ లోకి వచ్చేశారు. తన సొంత గ్రామ ప్రజలతో భేటీ అయ్యారు. గ్రామ సమస్యలపై ఆరా తీశారు. రోడ్డు సౌకర్యంపై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, వెనువెంటనే ఆయన గ్రామీణ రోడ్లకు సంబంధించి విస్పష్ట ప్రకటన చేశారు. నెలకు 400 కిలో మీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మిస్తామని, వచ్చే నాలుగేళ్లలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఆయన అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ఆ తర్వాత సమీపంలోని కల్యాణి డ్యాం పరిశీలనకు వెళ్లారు.

  • Loading...

More Telugu News