: రూ'పోయే'!... రెండేళ్ల కనిష్ఠానికి మారకపు విలువ!
డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. గురువారం నాటి ఫారిన్ ఎక్స్ఛేంజ్ సెషన్లో రూపాయి విలువ రెండేళ్ల కనిష్ఠానికి చేరి రూ. 66.89కి చేరింది. దిగుమతిదారుల నుంచి అమెరికన్ కరెన్సీ కోసం వచ్చిన డిమాండ్ కారణంగానే రూపాయి దిగజారిందని నిపుణులు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇతర దేశాల కరెన్సీ నుంచి కూడా రూపాయిపై ఒత్తిడి పెరిగిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించుకుని డాలర్ల విక్రయానికి నడుం బిగించకుంటే, సమీప భవిష్యత్తులో డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 68ని తాకవచ్చని అంచనా. కాగా, గురువారం నాటి ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ల ప్రకారం, రూపాయి మారకపు విలువ యూరోతో రూ. 70.69, జపాన్ యన్ తో రూ. 54.30, పౌండ్ స్టెర్లింగ్ తో రూ. 100.64గా ఉంది. ఈ సమయంలో అమెరికా నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారికి మరింత భారత కరెన్సీ లభిస్తుంది. దీంతో రెమిటెన్స్ మార్కెట్ వర్గాలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ, ఎన్నారైలను ఆకర్షించే పనిలో పడ్డాయి.