: తెలంగాణకూ నిధులొచ్చాయి!...‘అమృత్’ కింద రూ.416 కోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం కాస్తంత దయ తలచినట్టే ఉంది. మొన్నటికి మొన్న ఆర్థిక సర్దుబాటు కింద ఏపీకి రూ.700 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, మరి మా పరిస్థితి ఏమిటంటూ తెలంగాణ కూడా కేంద్రం వైపు ఆశగా ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో ‘అమృత్’ పథకం కింద తెలంగాణకు కూడా నిధులు విడుదల చేస్తూ నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణకు రూ.416 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న వాదన ఉంది. అయితే ఈ వాదనకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకే వారంలో ఇరు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది.