: ఆర్థిక నేరగాళ్లను ఉరి తీయాలన్న కారెం శివాజీ
ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న అక్రమార్కులను ఉరి తీయాలని మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక వడ్డీల ఆశ చూపుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలను నట్టేట ముంచుతున్న ఆర్థిక నేరగాళ్లకు ఉరి శిక్షే సరైదని ఆయన వ్యాఖ్యానించారు. లక్షలాది మంది పేదల డబ్బును అప్పనంగా కాజేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రతినిధులకు కూడా ఉరి శిక్షనే ఖరారు చేయాలని హైకోర్టును ఆయన కోరారు. మరోవైపు జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యం వందల కోట్లను లాగేస్తే, ఆ సంస్థ నుంచి తక్కువ ధరలకు ఆస్తులను కొనుగోలు చేసిన వారిని కూడా ఉపేక్షించరాదని ఆయన కోరారు.