: బెజవాడ టు భాగ్యనగరి వయా నారావారిపల్లె!... చాలా రోజుల తర్వాత హైదరాబాదుకు చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చాలా రోజుల తర్వాత రేపు హైదరాబాదుకు వస్తున్నారు. రేపు సాయంత్రానికి హైదారాబాదు చేరుకునే చంద్రబాబు సోమవారం ఉదయం దాకా ఇక్కడే ఉంటారు. నేడు బెజవాడ నుంచి బయలుదేరే చంద్రబాబు తొలుత నేరుగా చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా తన సొంతూరు నారావారిపల్లెకి వెళతారు. రేపు తన మనవడు దేవాన్ష్ తలనీలాల కార్యక్రమంలో పాల్గొన్న తరువాత తిరిగి రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి హైదరాబాదుకు బయలుదేరతారు. పాలనా సౌలభ్యం కోసం విజయవాడలోనే తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్న చంద్రబాబు దాదాపుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో ఒకసారి హైదరాబాదు వచ్చినా ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటున్న ఆయన వెనువెంటనే తిరిగి విజయవాడ వెళుతున్నారు. ఈ క్రమంలో రేపు హైదరాబాదుకు రానున్న చంద్రబాబు సోమవారం ఉదయం దాకా హైదరాబాదులోనే ఉండనుండటంతో టీ టీడీపీ వ్యవహారాలపై ఆయన సమీక్ష చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.