: తనకూ ఆమిర్ తరహా పరిస్థితే ఎదురైందన్న ఏఆర్ రెహ్మాన్!
మత అసహనం ఘటనల కారణంగా బెంబేలెత్తిన తన భార్య దేశం వదిలి వెళ్లిపోదామని ప్రతిపాదించిందంటూ బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ఆమిర్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టగా, సినీ పరిశ్రమ రెండు వర్గాలు విడిపోయింది. అనుపమ్ ఖేర్ లాంటి నటుల వర్గం అతడి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వర్గం ఆమిర్ ను వెనకేసుకువచ్చింది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూడా ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపేలా నిన్న సంచలన ప్రకటన చేశారు. తాను కూడా గతంలో ఆమిర్ ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొన్నానని ఆయన పేర్కొన్నారు. నాగరిక సమాజంలో ఉన్న మనం హింసకు దూరంగా ఉండాల్సిన అవసరముందని రెహ్మాన్ పేర్కొన్నారు. గోవా రాజధాని పనాజీలో నిన్న జరిగిన 46వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆప్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరానియన్ చిత్రం ‘ముహ్మద్:మెసెంజర్ ఆప్ గాడ్’కు ఆయన సంగీతాన్ని అందించిన సందర్భంగా ముంబైకి చెందిన ముస్లిం సంస్థ 'రజా అకాడెమీ' రెహ్మాన్ పై ఫత్వా జారీ చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆయన అలా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లలో జరగాల్సిన ఆయన సంగీత కచేరీలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చివరి నిమిషంలో రద్దు చేయించినట్టుగా కూడా వార్తలొచ్చాయి. అదే సమయంలో కొందరు విశ్వహిందూ పరిషత్ నేతలు, బీజేపీ నాయకులు స్పందిస్తూ, రెహ్మాన్ తిరిగి హిందూ మతంలోకి మారేందుకు ఇదే సరైన తరుణమని ఆయనను ఆహ్వానించారు కూడా.