: ఆమిర్ పై మండిపడ్డ కిరణ్ రిజిజు... దేశ ప్రతిష్ఠను మంటగలిపాడని అసహనం
దేశంలో ఇటీవల పెచ్చరిల్లిన మత అసహనంపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ మిస్టర్ ఫెర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పై బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దేశంలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందిన తన భార్య దేశం వదిలిపోదామంటూ తనను కోరిందని ఆమిర్ ఖాన్ నిన్న ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సహా పలువురు ఘాటుగా స్పందించారు. తాజాగా కిరణ్ రిజిజు కూడా ఆమిర్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘అసలు నిన్న జరిగిన చర్చ అసందర్భమైనది. మత అసహనం తదితరాలపై సమాజం ఏకమై సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా చర్చలు జరుగుతున్నాయి. దేశ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయి. ఎన్డీఏ హయాంలోనే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అసత్య ఆరోపణలు చేస్తూ కొందరు వ్యక్తులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు’’ అని రిజిజు వ్యాఖ్యానించారు.