: కడియం రికార్డు గల్లంతు... బైపోల్స్ లో 4 లక్షలు దాటిన పసునూరి మెజారిటీ


వరంగల్ లోక్ సభ చరిత్రలో తాజా ఉప ఎన్నిక సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఉప ఎన్నికలో గతంలో నమోదైన పోలింగ్ శాతం కంటే అధికంగా ఓట్లు పడగా, మెజారిటీలోనూ తాజా ఉప ఎన్నిక ఇప్పటిదాకా నమోదైన రికార్డులను చెరిపేసింది. నేటి ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి 15 రౌండ్లు ముగిసేసరికి పసునూరి దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4.08 మెజారిటీ సాధించారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడియం శ్రీహరి 3,92,574 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేతగా రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తదనంతర కాలంలో తెలంగాణ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కడియం తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కడియం రాజీనామాతో ఈ నెల 21న జరిగిన వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ బరిలోకి దిగారు. నేటి ఉదయం మొదలైన కౌంటింగ్ లో ఆది నుంచి పసునూరి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. 15 వ రౌండ్ ముగిసేసరికి ఆయన 5.45 లక్షల ఓట్లను సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1.37 లక్షల ఓట్లే వచ్చాయి. దీంతో కౌంటింగ్ పూర్తి కాకుండానే పసునూరి కడియం రికార్డు మెజారిటీని దాటేసి 4.08 లక్షల మెజారిటీ సాధించారు. కౌంటింగ్ ముగిసేసరికి ఈ మెజారిటీ మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News