: మూడు ప్లాన్లు విఫలం... నాలుగోది సక్సెస్: మేయర్ దంపతుల హత్యలో కొత్త కోణం!


సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యలకు సంబంధించి నెలల తరబడి కుట్ర జరుగుతూనే ఉందా? అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానం వినిపిస్తోంది. సొంత మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్ చేతిలోనే వీరు హత్యకు గురయ్యారు. మొన్నటిదాకా మోహన్ వెన్నంటే ఉన్న చింటూ, ఇటీవలే ఆయనకు దూరం జరిగాడు. కఠారి కుటుంబానికి మేయర్ పదవి దక్కగానే కొన్ని విషయాల్లో తలదూర్చిన చింటూను మోహన్ కొంతమేర దూరం పెట్టినట్లు సమాచారం. ఈ దూరం క్రమంగా వారి మధ్య విభేదాలకు దారి తీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు నెలల కిందటే చింటూ కఠారి దంపతుల హత్యకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో మొన్నటి దాడికి ముందే చింటూ మూడు సార్లు పక్కా ప్లాన్ తో కఠారి దంపతులపై దాడికి యత్నించాడు. సదరు యత్నాలు బెడిసికొట్టడంతో నాలుగో యత్నంలో ఏకంగా చిత్తూరు నగరపాలక సంస్థనే వేదికగా చింటూ ఎంచుకున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మొన్న దాడి జరిగిన సమయంలో చింటూ, అతడి సహచరుడు ధరించిన బురఖాలు రెండు నెలల క్రితమే కొనుగోలు చేశారట. అంతేకాక చిత్తూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న యాదమరిలో తాగు నీటి పథకాన్ని పరిశీలించేందుకు ఇటీవల వెళ్లిన కఠారి దంపతులపై అటాక్ చేసేందుకు చింటూ యత్నించాడు. అయితే పార్టీ కార్యకర్తలు, మోహన్ అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చింటూ నాడు వెనక్కు తగ్గాడట. నగరపాలక సంస్థ కార్యాలయమైతేనే దాడికి అనువుగా ఉంటుందని భావించిన చింటూ నాలుగో యత్నంలో సఫలమై సొంత మేనమామ, అత్తలను దారుణంగా హత్య చేశాడు.

  • Loading...

More Telugu News