: ఇక బ్రస్సెల్స్ వంతు... ‘ఉగ్ర’దాడుల హెచ్చరికలతో నగరంలో హై అలర్ట్


మొన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, నిన్న మాలి రాజధాని బమాకో... ఉగ్రవాదుల భీకర దాడులతో ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. తాజాగా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ పై ఉగ్రవాదులు విరుచుకుపడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల నుంచి తీవ్ర స్థాయి హెచ్చరికల నేపథ్యంలో బ్రస్సెల్స్ లో బ్రెజిల్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాద సంస్థల నుంచి వెలువడిన బెదిరింపులకు సంబంధించిన సమాచారంపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన బ్రెజిల్ ప్రభుత్వం బ్రస్సెల్స్ లో హై అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం నగరంలో అత్యున్నత స్థాయిలోని నాలుగో తరగతి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తరహా హెచ్చరికలు జారీ కావడం అక్కడ ఇదే ప్రథమమని తెలుస్తోంది. నగరంలోని రద్దీ ప్రాంతాలకు వీలయినంత మేర దూరంగా ఉండాలని, సమూహాలుగా వెళ్లరాదని బ్రస్సెల్స్ పౌరులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏ సంస్థల నుంచి ఏ తరహాలో బెదిరింపులు వచ్చాయన్న విషయంపై నోరు విప్పేందుకు నిరాకరిస్తున్న బ్రస్సెల్స్ పోలీసులు నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బ్రస్సెల్స్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో నగర జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

  • Loading...

More Telugu News