: జామ పండు చేసే మేలు అంతా ఇంతా కాదు!
మనకు విరివిగా లభించే పండ్లలో ‘జామ’ కూడా ఒకటి. ఈ పండు చేసే మేలు అంతా ఇంతా కాదు. జామ పండు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మన శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును ఈ ఫలం ఎంతో మెరుగుపరుస్తుంది. జామపండులో విటమిన్ సి, లైసోపెన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియంతో పాటు ఎనభై శాతం నీరు పుష్కలంగా ఉంటుంది. పూర్ణ ఫలమైన జామ పండును తీసుకోవడం ద్వారా మనం ఊహించని సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జామపండు తినడం ద్వారా చేకూరే ప్రయోజనాల విషయానికొస్తే... * రోగ నిరోధక శక్తి పెరుగుతుంది * కేన్సర్ బారిన పడకుండా చూస్తుంది * డయాబెటీస్ వ్యాధి నుంచి రక్షిస్తుంది * గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది * ఇతర ఫలాలతో పోలిస్తే ‘జామ’లో ఫైబర్ శాతం అధికంగా ఉండటంతో జీర్ణశక్తికి ఢోకా ఉండదు * కంటి చూపు తగ్గకుండా చూడటమే కాకుండా మెరుగు పరుస్తుంది * గర్భవతులకు విటమిన్ బి-9, ఫోలిక్ యాసిడ్ లు చాలా మంచిది. ‘జామ’లో ఈ రెండూ పుష్కలంగా ఉంటాయి. పుట్టబోయే బిడ్డ నరాల పనితీరు అద్భుతంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. * పంటినొప్పులు, చిగుళ్ల వాపు, ఓరల్ అల్సర్ల కు జామ రసం చెక్ పెడుతుంది. అంతేకాకుండా... మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి, జలుబు, దగ్గు రాకుండా ఉండడానికి, వయస్సు పైబడకుండా ఉండేందుకు, మెరుగైన శరీర ఛాయకు, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి జామపండును క్రమం తప్పకుండా తీసుకోవాలి.