: షుగర్ బాధితులు ఆహారంలో ఈ నియంత్రణ పాటిస్తే అంతా శుభమే!
రోజురోజుకీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారు. దీంతో షుగర్ బాధితులు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే సందేహం ఏదో ఒక క్షణంలో పట్టిపీడిస్తుంటుంది. ఏం తిన్నా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. మధుమేహ బాధితులు బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, గోధుమలు తినడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. మీగడ తీసిన పెరుగు, చిలికిన మజ్జిగ, డబుల్ టోన్డ్ మిల్క్ వంటివి తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి నష్టం వాటిల్లదని వారు చెబుతున్నారు. తాజా పళ్లు తినడం ఎంతో ఉపయోగమని వారు సూచిస్తున్నారు. పండ్లలో లభించే పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచివని చెబుతున్నారు. సాధారణ రొట్టెలు, పాలిష్డ్ రైస్, వైట్ ఫ్లోర్ వంటివి శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయని అది ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. పాల ఉత్పత్తులకు షుగర్ బాధితులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, అందులోని శాచ్యురేటెడ్ ఫాట్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయని అవి వారికి చేటు చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. వేపుళ్లు అస్సలు తినవద్దని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్, పాపడ్, పకోడీల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఇవి స్థూలకాయానికి దారి తీసే ప్రమాదం ఉందని, స్థూలకాయం మధుమేహ బాధితులకు మంచిది కాదని వారు స్పష్టం చేశారు. శీతల పానీయాలు షుగర్ వ్యాధిగ్రస్థులకు ఏ మాత్రం మంచివి కాదు. ఎందుకంటే, ఒక డ్రింక్ లో ఆరేడు టీ స్పూన్ల చక్కెర ఉంటుందని వారు తెలిపారు. పండ్ల రసాలు తాగడం కూడా మంచిది కాదని, జ్యూస్ లు తాగితే ఒకేసారి షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, అది మధుమేహ బాధితులకు ముప్పుగా పరిణమిస్తుందని వారు హెచ్చరించారు.