: వరంగల్ లో తొలి ఓటరుకు పుష్పగుచ్చంతో స్వాగతం... విపక్షాల అభ్యంతరం!
వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు రేపు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే తొలి ఓటరుకు గులాబి పువ్వు ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. కాగా, ఎలక్షన్ కమిషన్ కొత్తగా తొలి ఓటరుకు ఘన స్వాగతం పలికే పద్ధతిని ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ నిన్న(గురువారం) మీడియాకు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఎవరైతే మొదటి వేస్తారో వారికి, అక్కడున్న ఎన్నికల సిబ్బంది గులాబు పువ్వు ఇచ్చి లోపలికి సాదరంగా ఆహ్వానిస్తారని చెప్పారు. అయితే ఈ నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. తొలి ఓటరుకు గులాబీ పూలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా గులాబీ రంగులో ఉంటుందని, అటువంటప్పుడు ఓటర్లకు గులాబీ పూలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు.