: సోనియా విదేశీ బ్యాంకు ఖాతాల్లో లక్షన్నర కోట్లు ఉన్నాయి: సుబ్రమణ్యస్వామి ఆరోపణ
బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపణల పర్వం కొనసాగుతోంది. నిన్నటి దాకా రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన ఆయన ఈసారి సోనియా గాంధీని లక్ష్యం చేసుకుని ఆరోపణలు సంధించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశీ బ్యాంకు ఖాతాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు ఉన్నాయని సుబ్రమణ్యస్వామి తాజాగా ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ విదేశీ బ్యాంకు ఖాతాల్లో లక్షన్నర కోట్లు మూలుగుతున్న సంగతి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కూడా తెలుసని అన్నారు. కాగా, రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని, అతని వద్ద బ్రిటన్ పాస్ పోర్టు ఉందని సుబ్రమణ్యస్వామి పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ కూడా ఘాటుగా స్పందించారు. తన వద్ద విదేశీ పాస్ పోర్టు లేదని, తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుబ్రమణ్య స్వామి ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.