: నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు: రాహుల్ గాంధీ
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ మోదీ సర్కార్ కు రాహుల్ సవాల్ విసిరారు. రాహుల్ నాయనమ్మ, భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ తనపై లేనిపోని ఆరోపణలను చేస్తోందన్నారు. తాను బ్రిటిష్ పౌరుడినంటూ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మోదీకి తాను భయపడనని, అవసరమైతే జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు. ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు తనపై, తన కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని రాహుల్ హితవు పలికారు. ‘మోదీజీ ప్రధానిగా ఉన్నారు. ఆయన ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు సంస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి. చాలా విషయాలకు సంబంధించి నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నింటిపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశించరు?’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఆర్ఎస్ఎస్ ను వదల్లేదు. దేశానికి చెడ్డపేరు తెస్తోందంటూ ఆర్ఎస్ఎస్ పై మండిపడ్డారు.