: కేసీఆర్ సర్కారుకు షాక్...భద్రాచలం టీఆర్ఎస్ ఇన్ చార్జీని కిడ్నాప్ చేసిన మావోలు, మరో ఐదుగురిని కూడా!
వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. నిన్న రాత్రి ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాల సరిహద్దు ఖానాపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుందని భావిస్తున్న ఎన్ కౌంటర్ కు మావోయిస్టులు ప్రతిస్పందించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం టీఆర్ఎస్ ఇన్ చార్జీ మానె రామకృష్ణతో పాటు ఆ పార్టీకి చెందిన మరో ఐదుగురిని మావోయిస్టులు అపహరించారు. ఖమ్మం జిల్లాలోని చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ నేతలను మావోలు కిడ్నాప్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఆ పార్టీ నేతలను అపహరించినట్లు మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది. ఏకంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేత కిడ్నాప్ నకు గురి కావడంతో టీఆర్ఎస్ షాక్ కు గురైంది.