: ట్విట్టర్ లో దూసుకెళుతున్న కేజ్రీ... ఫాలోయర్ల సంఖ్యలో మోదీ తర్వాత స్థానంలో ఢిల్లీ సీఎం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి యత్నంలోనే ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకుని రికార్డు సృష్టించిన ఆయన, ఆ పదవి తృణప్రాయంగా వదిలేసి ఔరా అనిపించారు. ఏడాది తిరగకుండానే జరిగిన రెండో దఫా ఎన్నికల్లో ఆయన రికార్డు విజయం సాధించారు. మూడంటే మూడు సీట్లను మాత్రమే కోల్పోయిన ఆయన పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో మిగతా అన్ని సీట్లను కైవసం చేసుకుంది. తాజాగా కేజ్రీవాల్ ట్విట్టర్ లోనూ దూసుకుపోతున్నారు. నిన్న రాత్రి కేజ్రీ ట్విట్టర్ ఖాతాలో ఫాలోయర్ల సంఖ్య 60 లక్షల మార్కును తాకింది. ఈ విషయాన్ని కేజ్రీ పార్టీ స్వయంగా ప్రకటించింది. తాజా రికార్డుతో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ట్విట్టర్ లో అత్యధిక మంది ఫాలోయర్లున్న రాజకీయ నేతగా చరిత్ర సృష్టించారు. నరేంద్ర మోదీ ట్విట్టర్ కు 1.6 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.