: జగన్ కు శారదా పీఠాధిపతి ఆశీస్సులు...ప్రజాసంక్షేమం కోసం పోరాటం చేస్తున్నారని కితాబు
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వైసీపీ అధినేత, ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో ప్రజా సంక్షేమం కోసం జగన్ పోరాటం చేస్తున్నారని కితాబిచ్చారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయి స్తంభాల గుడిని స్వరూపానందేంద్ర సందర్శించారు. ఈ సందర్భగా వరంగల్ పర్యటనలో ఉన్న జగన్ ఆయనను కలిశారు. తనను కలిసిన జగన్ కు స్వరూపానందేంద్రస్వామి అనుగ్రహభాషణం చేశారు. ఆలయ వ్యవస్థకు ప్రభుత్వాలు చేస్తున్న కృషిని స్వరూపానందేంద్రస్వామి ప్రస్తావించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హిందూ ధార్మిక వ్యవస్థతో పాటు ఆలయ వ్యవస్థ రక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనబరచారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ దిశగా అభినందనీయ కృషి చేస్తున్నారని చెప్పారు. తండ్రి లాగే వైఎస్ జగన్ కూడా ధార్మిక భావాలు కలవారని, ప్రజా సంక్షేమం కోసం ఏపీలో పోరాటం చేస్తున్నారని, ఆయనకు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.