: ఇండియాలో ఉగ్రయుద్ధాన్ని కోరుకుంటున్న హైదరాబాదీ ఇంజనీర్!
ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ విస్తరణే లక్ష్యంగా జరుగుతున్న మారణహోమంలో భాగంగా ఇండియాలో ఐఎస్ఐఎస్ దాడులు జరపాలని ఓ హైదరాబాద్ ఇంజనీర్ కోరుకున్నాడు. ఉగ్రవాదుల సానుభూతిపరుడని పోలీసులు అదుపులోకి తీసుకున్న మొయినుద్దీన్, విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించినట్టు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. తొలుత దుబాయ్ చేరుకుని టర్కీ మీదుగా సిరియా వెళ్లాలన్న ఆలోచనతో బయలుదేరిన మొహియుద్దీన్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాను యూఎస్ లో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు జాతి వివక్ష, వేధింపులకు గురయ్యానని, ఆ సమయంలోనే ఐఎస్ఐఎస్ లో చేరి, యుద్ధాన్ని ఇండియాకు తేవాలని భావించినట్టు తమ విచారణలో మొహియుద్దీన్ వెల్లడించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. "నేను టెక్సాస్ లో ఉన్నప్పుడు దుబాయ్ లో నివాసముండే నిక్కీ జోసఫ్ అనే మహిళ పరిచయమైంది. ఆమె ఓ ముస్లింను వివాహం చేసుకునేందుకు ఇస్లాం మతం స్వీకరించింది. ఆపై ఆమె, నేను ఉగ్రవాద సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పాడు. కాగా, ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్న నిక్కీ జోసఫ్ అలియాస్ ఆయేషా, అలియాస్ అఫ్సా జబీన్ మాత్ర, తానెన్నడూ మొహియుద్దీన్ తో కలసి సిరియా వెళ్లాలని అనుకోలేదని చెబుతోంది.