: ఐఎస్ కేపిటల్ రఖ్కా నేలమట్టం...ఫ్రాన్స్ వైమానిక దాడుల్లో 33 మంది ఉగ్రవాదుల హతం
129 మందిని పొట్టనబెట్టుకున్న ఐఎస్ ఉగ్రవాదులపై ఫ్రాన్స్ ప్రతీకార దాడులు ముమ్మరమయ్యాయి. మూడు రోజులుగా జరుగుతున్న వైమానిక దాడుల్లో భాగంగా ఫ్రాన్స్ ఫైటర్ జెట్లు ఐఎస్ ఉగ్రవాదులకు పెను నష్టాన్నే మిగిల్చాయి. ఐఎస్ ఉగ్రవాదులకు సిరియాలోని రఖ్కా రాజధానిగా కొనసాగుతోంది. ఆయుధ కర్మాగారంతో పాటు ఐఎస్ కు చెందిన పలు కీలక స్థావరాలు రఖ్కాలోనే ఉన్నాయి. సిరియాలోని ఈ ప్రాంతం నుంచే ఐఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయి. నిన్న ఫ్రాన్స్ వైమానిక దాడుల్లో భాగంగా రఖ్కా నేలమట్టమైంది. ఐఎస్ కు చెందిన కీలక స్థావరాలు, చెక్ పాయింట్లు కూడా ధ్వంసమయ్యాయి. ఫ్రాన్స్ ఫైటర్ జెట్ దాడుల్లో 33 మంది ఐఎస్ ముష్కరులు కూడా హతమయ్యారు. మొత్తం 10 ఫైటర్ జెట్లతో రఖ్కాను నేలమట్టం చేశామని ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ వేస్ లేడ్రియాన్ వెల్లడించారు.