: ప్రధాని నివాసం వద్ద కాల్పుల కలకలం... మిస్ ఫైరే కారణమని నిర్ధారణ
ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద నిన్న రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. 7, రేస్ కోర్స్ రోడ్ లో ప్రధాని అధికార నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సదరు భవంతి వద్ద నిన్న రాత్రి ఉన్నట్టుండి మూడు రౌండ్ల కాల్పులు చోటుచేసున్నాయి. దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ప్రధాని నివాసం మీడియా పార్కింగ్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ చేతిలోని ఏకే 47 మిస్ ఫైర్ కారణంగానే ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తేలింది. తుపాకీని లోడ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆ తర్వాత భద్రతా అధికారులు తేల్చారు. మిస్ ఫైర్ కారణంగానే జరిగిన ఈ ఘటనలో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.