: సామాన్యుడిని మోదీ నిలువునా మోసం చేశారు!: సినీ నటుడు రాజ్ బబ్బర్
సామాన్యుడిని ప్రధాని నరేంద్ర మోదీ నిలువునా మోసం చేశారని బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బార్ ఆరోపించారు. త్వరలో గుజరాత్ లోని వడోదరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. కేవలం మూడు కారణాల వల్ల మోదీ తన అధికారాన్ని కోల్పోవలసి వస్తుందన్నారు. 'దాల్, దళిత్, దాద్రి' ఘటనలు మోదీని త్వరలోనే గద్దెను దించుతాయని ఆయన అన్నారు. ఇప్పటికే ఢిల్లీ, బీహార్ లో దెబ్బతిన్న ఎన్డీయేకు ఇక మిగిలింది 2017లో ఉన్న గుజరాత్ ఎన్నికలే చివరి పరీక్ష అని అన్నారు. దీంతో రానున్న రోజుల్లో ఎన్డీయే భవితవ్యమేమిటో తేలిపోతుందని రాజ్ బబ్బర్ అభిప్రాయ పడ్డారు. కాగా, నవంబర్ 22 నుంచి 29 వరకు గుజరాత్ లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి.