: హైదరాబాద్ లో ప్రేమికులపై దాడి... సోషల్ మీడియాలో హల్ చల్, ఫిర్యాదు రాలేదంటున్న పోలీసులు!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్, అబీడ్స్ లో ఉన్న సంతోష్ థియేటర్ లో ఈ ఉదయం ఓ ప్రేమికుల జంటపై దాడి జరిగింది. ఈ జంట థియేటర్ వద్ద ఉందన్న సమాచారం తెలుసుకున్న యువతి బంధువులు మందీ మార్బలంతో వచ్చి యువకుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడి దృశ్యాలను వీడియో తీసిన కొందరు వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అవి హల్ చల్ చేస్తున్నాయి. అయితే, దాడి జరిగిన దృశ్యాల గురించి తాము వ్యాఖ్యానించబోమని, ఘటనపై ఎటువంటి ఫిర్యాదూ తమకు అందలేదని అబీడ్స్ పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసును నమోదు చేస్తామని, ప్రస్తుతానికి వీడియో దృశ్యాల ఆధారంగా ప్రాథమిక విచారణ మాత్రం మొదలు పెట్టామని చెబుతున్నారు.