: ఇండియా నుంచి ఐఎస్ఐఎస్ కు నిధులు... ఎలా వెళుతున్నాయో వివరించిన ఎఫ్ఏటీఎఫ్ నివేదిక
తమ దైనందిన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వాడుకుంటున్నారని ఎఫ్ఏటీఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తన అక్టోబర్ నివేదికలో వెల్లడించింది. ఫ్రాన్స్ పై దాడులు జరపడానికి కొద్ది రోజుల ముందు ఎఫ్ఏటీఎఫ్ లో సభ్య దేశంగా ఉన్న ఇండియాకూ ఈ నివేదిక అందింది. ఇండియా నుంచి కూడా ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయని తెలియజేసిన టాస్క్ ఫోర్స్ అవి ఎలా వెళుతున్నాయో కూడా వివరించింది. మొత్తం 50 పేజీలున్న నివేదికలో, ఉగ్రవాదులు స్వల్పకాలిక రుణాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నారని తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాల నుంచి సైతం వీరికి నిధులు వెళుతున్నాయని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది. "వారు తమ నిధుల కోసం సోషల్ మీడియాను, సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉండే ఆన్ లైన్ ఫోరమ్ లను వినియోగించుకుంటున్నారు. డోనర్లను కాంటాక్టు చేసి, వారు డబ్బు పంపేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుసుకున్న తరువాత, ఇంటర్నేషనల్ ప్రీ పెయిడ్ కార్డులు కొనుగోలు చేసి, వాటి ఖాతా సంఖ్యలను స్కైపే వంటి మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. ఆపై ఆ నంబర్లను, పాస్ వర్డ్ ను వాడుతూ, సిరియాలోని తమ అనుచరులకు డబ్బు పంపుతున్నారు" అని తెలిపింది. ఉగ్రవాదులు 'క్రౌడ్ ఫండింగ్ టెక్నిక్'లను కూడా వినియోగిస్తున్నారని వివరించింది. ఇందులో భాగంగా, ఓ వెబ్ పేజీని తెరచి అందులో ప్రచారం చేసుకుంటారని, వివిధ దేశాల నియంత్రణను తప్పించుకుంటూ నిధులను చిన్న మొత్తాల రూపంలో సేకరిస్తున్నారని, వివిధ సమస్యలు చెప్పుకుంటూ, ఈ తరహాలో డొనేషన్లు కోరుతున్న వెబ్ సైట్ల సంఖ్య లక్షల్లో ఉందని ఎఫ్ఏటీఎఫ్ పేర్కొంది. ఇక పలు దేశాల్లోకి దొంగ కరెన్సీలను చొప్పించడం ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులందుతున్నాయని, ఇందుకు ఇండియా ఓ ఉదాహరణని, ముంబైపై ఉగ్రదాడికి ఈ విధానంలోనే డబ్బు సమకూరిందని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది.