: కడప జిల్లాలో ఐదుగురు చిన్నారులను బలిగొన్న భారీ వర్షాలు


దక్షిణ కోస్తాను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు కడప జిల్లాలో ఐదుగురు ముక్కుపచ్చలారని చిన్నారులను బలిగొన్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో వీరు మృతి చెందారు. రైల్వే కోడూరు మండలంలోని లక్ష్మీగిరి పల్లెలో గోడకూలి ఐదేళ్ల బాలుడు ఈ ఉదయం మరణించాడు. వర్షం కాస్త తెరిపివ్వడంతో సంబేపల్లి మండలంలోని బోయపల్లి గ్రామంలో నలుగురు చిన్నారులు ఓ పాడుబడిన ఇంటిలో ఆడుకుంటుండగా, ఆ ఇల్లు కుప్పకూలింది. దీంతో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శిధిలాలను తొలగించే పనిలో ఉన్నారు. కాగా, ఇప్పటివరకూ 14 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వెల్లడించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నేడు కూడా పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వందలాది షాపుల్లోకి నీరు చేరడంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సైతం ఆగిపోయాయి. పలు స్టేషన్లలో ప్లాట్ ఫాం ఎత్తునకు నీరు చేరడంతో తమిళనాడు నుంచి ఏపీ మీదుగా ఉత్తరాదికి వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. కేరళ నుంచి ప్రయాణించే రైళ్లను కర్ణాటక మీదుగా మళ్లించగా, విశాఖ నుంచి వచ్చి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను గుంటూరు, దొనకొండ, నంద్యాల, గుత్తి మీదుగా మళ్లించారు.

  • Loading...

More Telugu News