: వాళ్లను పట్టిస్తే రూ. 330 కోట్ల నగదు బహుమతి: పుతిన్
గత నెలలో రష్యా విమానాన్ని సినాయ్ పెనిన్సులా ప్రాంతంలో కూల్చివేసిన ఉగ్రవాదుల గుట్టు చెప్పిన వారికి భారీ పారితోషికాన్ని ఆ దేశం ప్రకటించింది. విమానాన్ని కూల్చేసిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు అవసరమైన సమాచారమిస్తే రూ. 330 కోట్ల నగదును ఇస్తామని రష్యా సెక్యూరిటీ విభాగం అధిపతి అలెగ్జాండర్ బోర్తనికోవ్ తెలిపారు. తమ విమానాన్ని కూల్చి 224 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎక్కడున్నా పట్టుకుని శిక్షించి తీరుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిజ్ఞ చేశారు. ఐఎస్ఐఎస్ తో పాటు ఇతర ఉగ్ర సంస్థలపైనా దాడులు చేస్తామని, ఫ్రాన్స్ తో కలసి సంయుక్తంగా యుద్ధం చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇదిలావుండగా, ఐఎస్ఐఎస్ పై ఫ్రాన్స్ మొదలెట్టిన యుద్ధాన్ని గురించి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు వివరించేందుకు ఫ్రాంకోయిస్ హొలాండే 24న వాషింగ్టన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.