: చిత్తూరుకు నేడు చంద్రబాబు ...‘కఠారి’ దంపతులకు నివాళి అర్పించనున్న ఏపీ సీఎం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు చిత్తూరుకు వెళ్లనున్నారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ లను నిన్న గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు ఘాటుగా స్పదించారు. మానవ మృగాల్లా వ్యవహరించిన దుండగులు మేయర్ దంపతులను హత్య చేశారని చంద్రబాబు విజయవాడలో పేర్కొన్నారు. దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన నిందితులు ఎంతటి పెద్ద వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. నేడు మేయర్ దంపతుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైన తర్వాత వారి భౌతిక కాయాలను చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించనున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోనే కఠారి దంపతుల భౌతిక కాయాలకు చంద్రబాబు నివాళి అర్పించనున్నారు.