: గంగమ్మతల్లి రహస్యమేంటి?... ఛేదించేందుకు కదిలిన సైంటిస్టులు!
పవిత్ర గంగానది... హిమాలయాల్లో పుట్టి వందల కిలోమీటర్లు ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోయే ఈ నది భారత ప్రధాన నదుల్లో ఒకటి. ఈ నదికి ఇరువైపులా ఎన్నో నగరాలు, పట్టణాలు. నిత్యమూ నదిలో ఎంతో దుర్గంధం, వ్యర్థాలు కలుస్తుంటాయి. కాశీలో అయితే, ఏకంగా సగం కాలిన శవాలను నదిలో వేసేస్తుంటారు. ప్రస్తుతం ఇండియాలోని జీవనదుల్లో అత్యంత కలుషితమైన నదిగానూ గుర్తింపు పొందింది. అయితేనేం, కోట్లాది మందికి ఈ నదే ప్రధాన తాగునీటి వనరు. ఈ నీరు తాగేవారికి ఎలాంటి జబ్బులూ రావు. దీనికి కారణమేంటి? ఈ ప్రశ్నే గంగమ్మతల్లి రహస్యాన్ని కనుగొనేందుకు సైంటిస్టులను కదిలేలా చేసింది. గంగానదిలో ఏదో రహస్యం ఉందని, స్వీయ శుద్ధ గుణాలున్నాయని, అది నీటిలోని బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు తుదముట్టిస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గంగా నది నీరు ఎంతో పవిత్రమైనదని భారతీయులు భావిస్తారు. ఎక్కడ పుణ్యకార్యాలు జరిగినా ఈ నదిలోని నీటిని వాడుతారు. ఇప్పుడీ 'శుద్ధ' గుణానికి కారణాల అన్వేషణకు కేంద్ర ఆరోగ్య, నీటి వనరుల మంత్రిత్వ శాఖలు రూ. 150 కోట్లతో అధ్యయనం మొదలు పెట్టాయి. ఎన్నో పేరున్న శాస్త్ర సాంకేతిక సంస్థలు తాము కూడా ఈ అధ్యయనంలో భాగమవుతామని చెప్పాయి. గంగా నదిలో మనకు తెలియకుండా ఉన్న 'ఎక్స్ ఫ్యాక్టర్'ను కనుగొని దాన్ని ప్రపంచానికి వెల్లడించడమే ఈ స్టడీ ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. 200 మంది శాస్త్రవేత్తలు నది రహస్యం తెలుసుకునేందుకు రానున్నట్టు వివరించారు. మరో ఆరు నెలల్లో నివేదిక సిద్ధమవుతుందని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి తెలిపారు. కాగా, గతంలో ఇదే విషయమై నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కాన్పూర్ ఐఐటీలు సంయుక్తంగా ఓ అధ్యయనం చేశాయి. హిమాలయాల్లో నుంచి వస్తున్న నీటిలోనే ప్రమాదకర క్రిములను హరించివేసే ప్రత్యేక వైరస్ నదిలో వస్తున్నదని, దానివల్లే ఎంత కాలుష్యమైనా నది నీరు పవిత్రంగా ఉంటోందని వెల్లడించాయి.