: సరిహద్దుల్లోకి కారులో దూసుకొచ్చాడు!


వాఘా- అటారీ సరిహద్దుల వద్దకు ఓ వ్యక్తి తన కారులో దూసుకొచ్చిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... అత్యంత కట్టుదిట్టంగా ఉండే భారత్- పాక్ సరిహద్దుల వద్దకు తెల్లవారుజామున 3.45 గంటలకు సురేందర్ సింగ్ అనే వ్యక్తి తన స్కార్పియో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ లో దూసుకొచ్చాడు. జీరో లైన్ వద్ద ఉన్న కస్టమ్స్ గేట్లను సైతం తన కారుతో ఢీ కొట్టేశాడు. దీంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. స్వర్ణ జయంతి ద్వార్ కు కొద్ది మీటర్ల దూరంలో ఉన్న బారికేడ్లను ఈ కారు ఢీ కొట్టిందన్నారు. ఈ సందర్భంగా అమృతసర్ స్పెషల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జెస్దీప్ సింగ్ మాట్లాడుతూ, ‘నిందితుడు సురేందర్ సింగ్ కెనడా జాతీయుడు. అతని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా అతనెందుకు చేశాడన్న విషయం అర్థం కావట్లేదు. అతన్ని మేము ప్రశ్నించగా, తెల్లముఖం వేశాడు. ఏవేవో పాటలు పాడుతున్నాడు. సైకియాట్రిక్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు మాకు ప్రాథమిక సమాచారం అందింది. అతనిపై కేసు నమోదు చేశాము’ అని ఆయన చెప్పారు. సిక్కుల మతగురువు గురునానక్ జన్మస్థలమైన నాన్కానా సాహెబ్ పాకిస్థాన్ లో ఉంది. అక్కడికి వెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పని చేశానని సురేందర్ సింగ్ చెప్పాడు. వీసా తీసుకోవడం, ఇతర ఫార్మాల్టీస్ పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే, అక్రమ మార్గంలో అక్కడికి చేరుకోవాలనుకున్నానని చెప్పాడు. అయితే, సరిహద్దుల్లో మన దేశ భద్రత ఏవిధంగా ఉందో తెలియడానికి ఈ సంఘటన నిదర్శనమంటూ పలువురు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News