: చంద్రబాబు క్యాంప్ ఆఫీసులో జయప్రద
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆమె వచ్చారు. ఆమె రాక అందర్లోనూ ఆశ్చర్యాన్ని, ఆసక్తిని నింపుతోంది. గతంలో టీడీపీలో ఉన్న జయప్రద తదనంతర పరిస్థితుల్లో పార్టీని వీడి, సమాజ్ వాది పార్టీలో చేరి, అక్కడ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. కొన్ని సమస్యల వల్ల తన రాజకీయ గురువు అమర్ సింగ్ తో పాటు ఆమె కూడా సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి జయప్రద రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జయప్రద మళ్లీ టీడీపీలోకి రావచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, కాసేపట్లో సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభంకానుంది.